అమరావతి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జొన్నవలస గ్రామంలో సిరిమాను వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి, గొడ్డలితో వృక్షానికి గంటు పెట్టి ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం అమ్మవారు ఒక ఊరిలో సిరిమాను వృక్షాన్ని కోరుకుంటారని తెలిపారు. ఈ ఏడాది జొన్నవలస గ్రామంలో వృక్షాన్ని కోరుకున్నారని చెప్పారు. వృక్షాన్ని తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ ఏడాది కూడా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు కొండపల్లి శ్రీనివాస్.
ఈ పండగకు ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు వస్తారని అన్నారు. పైడితల్లి పండగ నేపథ్యంలో విజయనగర ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయని వెల్లడించారు మంత్రి. ఆలయాన్ని పునర్నిర్మించి సర్వాంగ సుందరంగా తయారు చేశారని అన్నారు. తెలియని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఘనంగా పునఃప్రతిష్ట కార్యక్రమం జరిగిందని గుర్తు చేశారు కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం అంటేనే కళలకు కాణాచి అని, ఆలయానికి అన్ని విధాలుగా రంగులు దిద్ది విభిన్న కళలతో అలంకరించారని అన్నారు
పండగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలంతా క్రమశిక్షణతో ఎటువంటి అంతరాయం లేకుండా ఉత్సవాలను ఆస్వాదించాలని మంత్రి కోరారు.




