పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు : పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం పనులకు రూ. 30 వేల కోట్లతో శంకుస్థాపన చేశాం అన్నారు. 5 లక్షల ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలు చేపట్టాం. మరో 3 లక్షల ఇళ్లకు భూమిపూజ చేసినట్లు తెలిపారు. మున్సిపాల్టీల్లో, కార్పొరేషన్లల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 11,359 కోట్ల పనులను చేపట్టాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భూ వివాదాలను పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించాం అన్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రూ. 52 వేల కోట్ల విలువైన ఆస్తిపై 60 వేల మందికి లబ్ది చేకూరేలా పూర్తి హక్కులతో పట్టాలిచ్చామని తెలిపారు.
సంక్షేమం అందించడంతోపాటు వ్యక్తిగత అవసరాలు తీరుస్తున్నాం.. సామాజిక అవసరాలు నెరవేరుస్తున్నాం అన్నారు. వ్యక్తి భద్రత, కుటుంబ సాధికారత, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని, స్థానిక ఎన్నికలు జరగ కూడదని గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లిందని ఆరోపించారు .ఏపీలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు గొడ్డలి పార్టీ అన్యాయం చేయాలని భావించిందన్నారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కోత పెట్టిందన్నారు. బీసీలపై గొడ్డలి పార్టీకి ఏ మాత్రం అధ్యయనం చేయలేదన్నారు.. వారికి న్యాయం చేయాలని ఏనాడూ భావించ లేదని పేర్కొన్నారు.