newsseals.com

తిరుమ‌లలో కళా సంస్కృతుల కనువిందు

October 13, 2026 · VijayaBhaskar

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేష వాహనసే వలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో భక్తులను విశేషంగా అలరించారు. భక్తిభావం ఉట్టిపడే జానపద నృత్యాలు, సంప్రదాయ సంగీతం, రంగు రంగుల వేషధారణలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, అస్సాం, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 17 కళా బృందాల్లోని 477 మంది కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ జానపద కళారూపం తప్పెటగుళ్లు, అరకు ప్రాంత గిరిజన నృత్యం థింసా, తమిళనాడుకు చెందిన కురవంజి నృత్యం, కర్ణాటక తీర ప్రాంత సంప్రదాయ కళా రూపాలు, అస్సాంకు చెందిన ప్రసిద్ధ బిహూ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

లయ బద్ధమైన అడుగులు, జానపద సంగీతం, వైవిధ్యభరితమైన కళా ప్రదర్శనలతో కళాకారులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల జానపద కళలకు ప్రోత్సాహం అందించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. శ్రీవారి వాహనసేవల సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళాసంపదను ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని కల్పించాయి. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 20వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

Related News