అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీపి కబురు చెప్పారు. విజయనగరం జిల్లా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే నిమిత్తం వెంటనే చేయాల్సిన పనులపై దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయానికి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వివిధ వినతులను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 22.14 కోట్లతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి వి బి జి రామ్ జి పథకం (VB-G RAM G)లో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ. 205.69 కోట్లు జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు.
చెరువుల్లో పూడిక తొలగించి, పునరుద్ధరణ చేయడంతో పాటు నీరు సరఫరా అయ్యే కాలువలు పునరుద్ధరణ, స్లూయిస్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా ఈ పనులు వెంటనే మొదలు కానున్నాయి. ఈ పనుల వల్ల విజయనగరం జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగు, సాగునీటి కొరత తీరుతుంది. ఈ సందర్బంగా విజయనగరం జిల్లా వాసులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా తమ కూటమి ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్దికి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్.




