newsseals.com

సీఎంఆర్ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి భద్రత : ఎస్. స‌విత

October 14, 2026 · VijayaBhaskar

పెనుకొండ/శ్రీ సత్య సాయి జిల్లా : పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 70 మంది లబ్ధిదారులకు రూ.31,43,227 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పెనుకొండ నియోజకవర్గ పరిధిలో గడిచిన 28 నెలల్లో 1,461 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం రూ.15 కోట్ల 75 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన పేదలకు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం ఎంతో మేలు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో నూతన పెన్షన్లు అంద జేయడంతో పాటు పేదలకు గృహ వసతి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకు,లు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related News