దుర్గ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబికా దేవి
నంద్యాల జిల్లా : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మ వారి ఉత్సవమూర్తిని కూష్మాండ దుర్గ స్వరూపంలో అలంకరింప చేశారు.ఈ దేవి ఎనిమిది భుజాలను కలిగి ఉంటుంది. అందుకే ఈమెను అష్ట భుజాదేవి అని కూడా పిలుస్తారు. సృష్టి లేకుండా ఈ జగత్తంతా చీకటిమయంగా ఉన్నప్పుడు, ఈ కూష్మాండదుర్గ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఈ కారణంగా ఈమె సృష్టికి ఆది స్వరూపిణిగా కూడా కీర్తించబడుతోంది
కూష్మాండా దేవిని ఆరాధించడం వల్ల రోగాలన్నీ నివారించబడి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని కూడా చెప్పబడుతోంది. వాహన సేవలో భాగంగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను కైలాస వాహనంపై అధిరోహింప చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు .అనంతరం వైభవంగా గ్రామోత్సవం జరిగింది. స్వామి అమ్మ వార్లును దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.