Saturday, 17 October 2026

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో రాజీ ప‌డొద్దు

newsseals-Poalvaram

పోలవరం : పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పర్యటన ముగిసింది. ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన నిపుణులు.. కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులు, నాణ్యతా నియంత్రణ పరీక్షలను పరిశీలించారు. గ్యాప్‌-1, 2 నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. నిర్మాణ నాణ్యత, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పర్యటనలో మొత్తం 40 గంటలపాటు ప్రాజెక్టు పనులపై దృష్టి సారించిన నిపుణులు.. 13 గంటలు క్షేత్రస్థాయి పరిశీలనకు, 27 గంటలు సమీక్షా సమావేశాలకు కేటాయించారు. రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌ పాల్‌ ఈ పర్యటనలో పాల్గొన్నారు. తొలి రెండు రోజులు కేంద్ర జలసంఘం డిజైన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ సరబ్జిత్‌ సింగ్‌ బక్షి, నేషనల్‌ వాటర్‌ సిస్టం డైరెక్టర్‌ పన్నీర్‌ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్‌ గౌతమ్‌.. సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు షాహిద్‌ నూర్‌, ఎం.కె. బాషా, ఉదయ్‌ భాను చక్రబోర్తి, వ్యాప్కోస్‌ జనరల్‌ మేనేజర్‌ కేపీఎస్‌ త్యాగీ కూడా సమీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో పాల్గొన్నారు.

పీపీఏ సీఈఓ సంజీవ్‌ వోహ్రా, సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, ఉప సంచాలకుడు ఏ. ప్రవీణ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేష్‌కుమార్‌, సహాయ సంచాలకుడు సీహెచ్‌ సంజీవ్‌, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, చీఫ్‌ ఇంజినీర్‌ కె. శేషుబాబు, ఎస్‌ఈలు పి. రామచంద్రరావు, డి. తిరుమలరావు, ఈఈలు డి. శ్రీనివాస్‌, ప్రేమ్‌చంద్‌, కె. బాలకృష్ణమూర్తి, ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీ గంగాధర్‌కుమార్‌, డీజీఎం మురళి పమ్మి, కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ చంద్‌ పర్యటన, సమీక్షల్లో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన సమీక్షా సమావేశాలకు వోహ్రా అధ్యక్షత వహించారు. పర్యటనలో భాగంగా నిపుణులు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లోని గ్యాప్‌-1, 2 నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని నాణ్యతా నియంత్రణ పరీక్షా కేంద్రాలను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరీక్షలు జరిపి నిర్మాణ పనుల నాణ్యతను అంచనా వేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణం, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర నిర్మాణాల్లో సాంకేతికత వినియోగం బాగుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *