Sunday, 18 October 2026

తాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు

newsseals-HMWSSB

హైద‌రాబాద్ : హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్ (Fore Fathers Pub)లో నీటి దుర్వినియోగానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, సదరు పబ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపి వేశారు.

రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించు కోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.

తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు ప్రజల దృష్టికి వచ్చిన పక్షంల సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు సమాచారం అందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *