newsseals.com

మిథున్‌రెడ్డి ఘటనపై సమగ్ర విచారణ జరగాలి

October 19, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం చెడ‌గొట్టేందుకు వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి వాహన శ్రేణిపై జరిగిన దాడి, నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు, పోలీసుల వ్యవహారశైలిపై జగన్ చేసిన ఆరోపణలను చట్టపరంగా పరిశీలించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సంఘటనలకు సంబంధించిన పూర్తి దృశ్యాలు, సీసీటీవీ రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇరుపక్షాల ఫిర్యాదుల ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాలన్నారు. హింసకు పాల్పడిన వ్యక్తులు ఏ పార్టీకి చెందినవారైనా చర్యలు తీసుకోవాలని, రాజకీయ హోదా ఎవరికీ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వదని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు సమర్పించే వాతావరణం కల్పించడం ఎన్నికల యంత్రాంగం, పోలీసుల బాధ్యతని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారికి ప్రత్యేక హక్కులు, ప్రతిపక్షంలో ఉన్నవారికి పరిమిత అవకాశాలు కల్పించడం కాదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ప్రతి అభ్యర్థికీ పోటీ చేసే స్వేచ్ఛ, ఓటరుకు నిర్భయంగా ఓటు వేసే హక్కు, బాధితుడికి న్యాయం పొందే అవకాశం ఉండాలన్నారు అచ్చెన్నాయుడు. గతంలో జరిగిన సంఘటనలపై ఒక ప్రమాణం, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మరో ప్రమాణం అనుసరించడం సరికాదని పేర్కొన్నారు. నేడు జగన్ లేవనెత్తిన ప్రతి ఆరోపణపై నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుతున్నామని, అదే న్యాయసూత్రం వైసీపీ పాలనలో బాధితులైన ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలకూ వర్తించాలన్నదే తమ అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. 2020 స్థానిక ఎన్నికల వివాదాల సందర్భంగా హైకోర్టు విచారణ రికార్డుల్లో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్న 35 ఘటనలు, బలవంతంగా ఉపసంహరింప జేసిన 23 సందర్భాలు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై జరిగిన 55 హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఆరోపణలు ప్రస్తావనకు వచ్చాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Related News