ఏపీ వెలుపల తిరుమల లడ్డూ కేసు మార్చలేం
న్యూఢిల్లీ : భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించిన కేసుపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి మార్చాలన్న అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీంకోర్టు. దీనితో ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది.. తిరుపతికి చెందిన ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త నిందితుల్లో ఒకరైన మచింద్ర శాంతారాం లాంకే (ఇతను ‘మల్‌గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అధినేత) ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ప్రకటనలు ఈ వివాదానికి రాజకీయ రంగు పులిమాయని ఆయన వాదించారు.
రాజకీయ నాయకుల వ్యాఖ్యలు విచారణ వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చని, దీనివల్ల నిందితులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. నెయ్యి నమూనాల్లో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టంగా నిర్ధారించలేదని, అయినప్పటికీ ఈ అంశంపై బహిరంగ చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిందితుల్లో చాలామంది ఉత్తర భారతదేశానికి చెందిన వారని, ఆంధ్రప్రదేశ్‌లో వారికి భాషా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, కాబట్టి విచారణను పొరుగు రాష్ట్రానికి మార్చాలని ఆయన కోరారు. తన క్లయింట్ రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వివాదంలో చిక్కుకున్నారని, ఈ వివాదం వల్ల అనవసరమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని ఆయన వాదించారు. అయితే, విచారణను తరలించడానికి తగిన కారణాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.