Friday, 13 November 2026

4.5 ల‌క్ష‌ల మందికి చేయూత పెన్ష‌న్లు పంపిణీ

newsseals-CheyuthaPensions

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ల‌బ్దిదారుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూతన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ వేడుకగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది . రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయి.

తాజా మంజూరుతో కలుపుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొత్తం కొత్త పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 5,73,625కి చేరింది. ఇప్పటికే గతంలో 1,23,625 మందికి మంజూరయ్యాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న నూతన లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయనున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ , సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *