అమరావతి : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కొత్త పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై శనివారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ప్రమాదంలో గాయపడి విశాఖపట్నంలోని షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎస్.రాయవరం మండలం కొత్త పోలవరం వద్ద ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న హోం మంత్రి అనిత, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు.
మరో వైపు ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు నక్కపల్లి మండలం చినతీనార్లకు చెందిన వాసపల్లి నూకతల్లి, ఒరుపల్లి రత్నంగా గుర్తించారు. బైక్ నడుపుతున్న అల్లుడు ఒరుపుల నారాయణ గాయపడ్డారు. ఈ ఘటనపై కూడా హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.




