అమెజాన్ ప్రైమ్ వీడియలో విశ్వక్ సేన్ కల్ట్ స్ట్రీమింగ్
హైదరాబాద్ : నటుడు విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘కల్ట్’ (Cult) ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ స్లాషర్ థ్రిల్లర్, నవంబర్ 19న గురువారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. స్వయంగా విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి స్లాషర్ థ్రిల్లర్ చిత్రంగా ప్రచారం పొందింది. గోవాలో జరిగే ఒక భారీ పార్టీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
వేడుకగా మొదలైన ఆ కార్యక్రమం, కొందరు వ్యక్తులు ప్రాణాంతక ఆటల్లో పాల్గొనాల్సిన భయంకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రలో నటించగా అక్కడ చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా సందీప్ కాకరాల నిర్మించారు. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది . థియేటర్లలో ‘కల్ట్’ చిత్రాన్ని చూడలేక పోయిన ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీనిని చూడవచ్చు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.