newsseals.com

గోదావ‌రి పుష్క‌రాల కోసం రూ. 1,115 కోట్లు

November 23, 2026 · VijayaBhaskar

హైదరాబాద్: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ఎనిమిది కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం, మౌలిక సదుపాయాల కల్పన , ఆలయాల అభివృద్ధి కోసం రూ. 1,115 కోట్లను మంజూరు చేసింది. ఈ సందర్భంగా లోగో , ట్యాగ్‌లైన్ రూపకల్పన కోసం పోటీని నిర్వహిస్తుండగా, దీనికి నవంబర్ 30ని తుది గడువుగా పేర్కొంది. నీటి పారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలోని 74 ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిధులలో భాగంగా బాసర ఆలయానికి రూ. 324 కోట్లు, భద్రాచలానికి రూ. 276 కోట్లు , కాళేశ్వరానికి రూ. 198 కోట్లు కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వం బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం , భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద స్నాన ఘట్టాలు, ఆలయాలు, రహదారులు, పారిశుధ్యం , తాగునీటి వసతులు వంటి సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. సోమవారం జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు మంత్రి. పుష్కరాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను , తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్లను రూపొందించాలని విద్యార్థులను కోరారు. వచ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వరకు పుష్కరాలు జరగనున్నాయి.

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ పోటీలో వ్యక్తులు లేదా గరిష్టంగా ముగ్గురు సభ్యులున్న బృందాలు పాల్గొనవచ్చని తెలిపారు. సమర్పించే ఎంట్రీలలో లోగోతో పాటు, ఐదు పదాలకు మించని ట్యాగ్‌లైన్ కూడా ఉండాలి. ఈ పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 1 లక్ష, రెండో బహుమతిగా రూ. 50,000 , మూడో బహుమతిగా రూ. 25,000 అందజేస్తారు. అలాగే, మొదటి 100 ఎంట్రీలను పంపిన వారికి ధృవీకరణ పత్రాలను (సర్టిఫికెట్లు) అంద జేయనున్నారు. ఎంట్రీలను నవంబర్ 30న‌ సాయంత్రం 5 గంటలలోపు godavaripushkaralutg@gmail.comకు ఈమెయిల్ చేయవచ్చు, లేదా హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పోస్ట్ ద్వారా లేదా నేరుగా వచ్చి సమర్పించవచ్చు.

Related News