తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం సాధికారక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర సంచలన ప్రకటన చేశారు. సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు నియామక నిబంధనలకు సంబంధించి స్పందించారు. ఈ మేరకు అధికారికంగా కీలక వ్యాఖ్యలు చేశారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి మాజీ సైనికులు, పౌరుల మధ్య అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ స్పష్టం చేశారు చైర్మన్, ఈవో.
ఈ నిష్పత్తిని మార్చి కొత్త విధానంలో నియామకాలు చేపట్టే అంశం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా యథాతథంగా కొనసాగుతోందని వెల్లడించారు . కాగా నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. కావున, ఈ అంశంపై ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు ముద్దాడ రవిచంద్ర. సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.




