హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వంద ఏళ్లు పూర్తి చేసుకున్నారు నవంబర్ 20వ తేదీతో. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, ఇక్కడి విద్యా వ్యవస్థకు ఒక గొప్ప వేడుక అని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమం లోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ చుక్కా రామయ్య క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు , విద్యార్థులకు ‘ఐఐటి’ అనే పదాన్ని పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని ఆయన కొనియాడారు. కేవలం విద్యావేత్త గానే కాకుండా, శాసనమండలి సభ్యుడిగా కూడా ఆయన ఈ ప్రాంతంపై తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వ్యక్తులతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. అటువంటి అనుబంధం లభించడం పట్ల తాను గర్వ పడుతున్నానని, తనను తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నానని చెప్పారు. శాసనమండలిలో సామాజిక, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా రామయ్య సూచించేవారని ఆయన పేర్కొన్నారు.అవిభక్త రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల లేదనే విషయాన్ని చుక్కా రామయ్య శాసనమండలిలో లేవనెత్తే వరకు ఎవరికీ తెలియదని, ఆయన ప్రస్తావించిన తర్వాతే ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
చుక్కా రామయ్య వంటి వ్యక్తులు కాలానికి, రాజకీయాలకు అతీతమైనవారని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. చుక్కా రామయ్య ఆలోచనలు, సూచనలు , సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, ఇతర ప్రముఖులు చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




