Friday, 20 November 2026

రాష్ట్రాల ఆర్థిక పురోగతి ఆధారంగా డీలిమిటేష‌న్ చేయాలి

newsseals-RevanthReddy

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పురోగతికి కూడా తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను 50% పెంచడం వల్ల దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం కేవలం ఉత్తర రాష్ట్రాల సీట్ల ద్వారానే ఏర్పడే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన ప్రక్రియలో రాష్ట్రాల జీడీపీ (GDP), జనాభా రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో ‘ఏబీపీ నెట్‌వర్క్’ (ABP Network) నిర్వహించిన ‘#TheSouthernRisingSummit2026’ మీడియా సదస్సులో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు

దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నమూనా గురించి గత నాయకుల దూరదృష్టి గురించి ముఖ్యమంత్రి వివరించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు ప్రతి పేద వ్యక్తి అభ్యున్నతినే నిజమైన అభివృద్ధిగా భావించారని ఆయన గుర్తు చేశారు. నెహ్రూ విద్య , సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ, అనేక విద్యా సంస్థలను, సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు చేపట్టిన సంస్కరణలు, ఆయన ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు , వాటిని మన్మోహన్ సింగ్ కొనసాగించిన తీరును ప్రస్తావించారు . కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా పేదల సంక్షేమం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంపైనే దృష్టి సారించిందని ఆయన చెప్పారు.

తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు TelanganaRising2047′ అనే విజన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ , ‘ఏఐ సిటీ’ (AI City) వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తన లక్ష్యాన్ని ఆయన వివరించారు. గత మూడేళ్లలో 65% కార్యక్రమాలను అమలు చేశామని, మిగిలిన వాటిని రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విస్తృతమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నామని, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో జరగనున్న InvestTelanganaGlobalSummitకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు అందించే విద్యకు సమానమైన విద్యను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో విద్యా రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని ఆయన అన్నారు. 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలలోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్రం ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని ఆయన వివరించారు. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలలు చాలా దూరంగా ఉండటం వల్ల విద్యార్థులు చదువు మానేస్తున్న పరిస్థితిని పరిష్కరించేందుకు, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థ పరిధిలోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా నియమించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తున్నందున పాత కోర్సులను దశల వారీగా తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు తెలంగాణలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

క్రీడలను అభివృద్ధి చేయడానికి, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. 8,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని ఇప్పటికే తెలంగాణకు తీసుకు వచ్చామని, పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మెస్సీ తన అభిమాన ఆటగాడని, గతంలో అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మారడోనా కూడా తనకు అభిమాన ఆటగాడిగా ఉండేవారని ముఖ్యమంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *