హైదరాబాద్ : హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా సింగూర్-మంజీరా నీటికి ప్రత్యామ్నాయంగా అదనపు గోదావరి నీటిని బదిలీ చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్ నుండి ఘన్పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు గోదావరి నీటిని తరలించే 1,600 మిల్లీమీటర్ల వ్యాసం గల మిషన్ భగీరథ–హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కృపాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పైప్‌లైన్ అనుసంధాన పనులను తనిఖీ చేశారు. సంబంధిత అధికారుల నుండి పనుల పురోగతి , సాంకేతిక అంశాలపై తాజా సమాచారాన్ని కోరారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి, ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
వాస్తవానికి ఈ నెల 15వ తేదీలోగా పైప్‌లైన్ నిర్మాణం , అనుసంధాన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అటవీ ప్రాంతం గుండా వెళ్లే 150 మీటర్ల పైప్‌లైన్ పొడవునా ఉన్న భారీ రాతి పొరలను తొలగించాల్సి రావడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఫలితంగా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి కాలేదు. మిగిలిన పనులను ఇప్పుడు వేగవంతం చేస్తున్నారని, రెండు రోజుల్లో వాటిని అన్ని విధాలుగా పూర్తి చేసి, ఆ తర్వాత ట్రయల్ రన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ఘన్పూర్ ఎంబీఆర్ (MBR) వద్ద హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి (HMWSSB) చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ జంక్షన్ వినియోగానికి సిద్ధంగా ఉంది. ‘మిషన్ భగీరథ’ పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తయిన వెంటనే ట్రయల్ రన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
‘ఎల్ నినో’ (El Niño) పరిస్థితుల కారణంగా సింగూరు–మంజీర నీటి వనరులలో లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో నగరానికి తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అదనంగా మరో 40 ఎంజీడీ (MGD) గోదావరి నీటిని నగరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా, గోదావరి నుంచి అదనపు నీటిని తరలించడం ద్వారా సింగూరు–మంజీర నీటిపై ఆధారపడిన ప్రాంతాల్లో ఏర్పడే నీటి కొరతలో సుమారు 50 శాతాన్ని భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు.




