హైదరాబాద్ : విద్యా రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ విద్యావేత్త, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మార్గదర్శి, పద్మశ్రీ పురస్కార గ్రహీత చుక్కా రామయ్య (ఐఐటి రామయ్య) ఇవాళ పుట్టిన రోజు. నవంబర్ 20న ఆయన 101వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవ మరువలేనిది: సామాన్య విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకు రావాలనే సంకల్పంతో రామయ్య వేలాది మంది విద్యార్థులకు ఐఐటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. విద్యను కేవలం జీవనోపాధి మార్గంగా కాకుండా, సామాజిక మార్పునకు ఒక శక్తివంతమైన సాధనంగా భావించిన ఆయన జీవితం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రొఫెసర్ హరగోపాల్.
ఇవాళ స్వయంగా తన నివాసానికి వెళ్లి సన్మానం చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు, విద్యార్థుల ఉన్నతి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు .ఇక రామయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, గణితశాస్త్ర నిపుణుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనను అభిమానులు ఐఐటీ రామయ్య అని పిలుస్తారు. వరంగల్ జిల్లాలోని గూడురు గ్రామంలో నవంబర్ 20, 1925లో పుట్టారు. టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత విద్యావేత్తగా మారారు. గణితశాస్త్ర బోధన, ఐఐటీ ప్రవేశ పరీక్షల శిక్షణ ఇవ్వడంలో గుర్తింపు పొందారు.
1983లో నాగార్జునసాగర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఐఐటీ స్టడీ సర్కిల్ ను ప్రారంభించారు.పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఐఐటీ శిక్షణ అందించారు. గణితాన్ని సులభంగా బోధించే ప్రత్యేక పద్ధతిని అనుసరించారు. వేలాది మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు మార్గ దర్శకత్వం చేశారు.
నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. అంటరానితనం, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. బాసరలో ఐఐఐటీ ఏర్పాటు కోసం కూడా కృషి చేశారు. 2007లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేశారు. విద్యా రంగానికి సంబంధించిన పలు పుస్తకాలను రచించారు. విద్యా వ్యవస్థలో మార్పులు, మాతృభాషలో విద్య, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.




