హైదరాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాజాగా జడ్చర్లలో జరిగిన ఓ సమావేశంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రభుత్వ అధికారులపై సీరియస్ కామెంట్స్ చేశారు. లంచం ఇస్తేనే పనులు అవుతున్నాయని, దీనికి ప్రధాన కారకులు అధికారులేనంటూ ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆకునూరి మురళి. ఎక్కడ చూసినా లంచగొండులు. 85 శాతం అధికారులు, ఉద్యోగులు, 90 శాతం మంత్రులు MLA లు ఇందులో ఉన్నారని పేర్కొన్నారు . అందరూ కలిసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చేస్తే ఉద్యోగం పోతుంది, MLA గిరి పోతుంది , శిక్షలు ఉంటాయి అనే భయం ఉందా అసలు ? వీరికి అని ప్రశ్నించారు. అలాంటి బలమైన చట్టం లేక పోవడం వల్లనే ఇలా పేట్రేగి పోతున్నారంటూ మండిపడ్డారు.
MLA గారూ.. ఏం చేద్దాం ? CMకి మీకు అంటే అందరూ MLA లకు చిత్త శుద్ధి ఉంటే అవినీతి నిరోధక చట్టం తీసుకు రావచ్చన్నారు. ఈ చట్టం పరిధిలోకి IAS, IPS, అందరూ అధికారులను, MLA లను, మంత్రులను, MP లను, జడ్జీలను, కాంట్రాక్టర్లను కూడా తీసుకు రావాలన్నారు. పది స్పెషల్ కోర్టులు పెడదామన్నారు ఆకునూరి మురళి. రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మెజిస్టీరియల్ పవర్స్ ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ఈ కమిషన్ పరిధిలోకి ఏసీబీని కూడా తీసుకు రావాలన్నారు. నెల రోజులలో శిక్షలు పడేటట్లు, శిక్షలు గట్టిగా ఉండేటట్లు, అవినీతి జరుగకుండా ముందే అరికట్టేటట్లు గట్టి చట్టాన్ని రూపొందించాలన్నారు.
ఇలా మీరు చేయరు. ఎందుకంటే మీరు కూడా అందులో భాగం అని ఆరోపించారు. ఏదో చిన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని ఏదో చేస్తున్నట్లు మొక్కుబడి పనులు చేస్తారన్నారు. రోజు రోజుకు అవినీతి పెచ్చరిల్లి పోతోందని , దీనిని నియంత్రించడం కష్టంగా మారిందన్నారు ఆకునూరి మురళి.




