
అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుపతి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి పుర ప్రజలను విశేషంగా అలరించాయి . మహాతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ విశ్రాంత గాయకులు బి. రఘునాథ్ తమ బృందం విష్ణుప్రియ, వరలక్ష్మి, భావన గార్లతో ప్రదర్శించిన గాత్ర కచేరీ సభను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఇందులో భాగంగా మొదట ఆదిమూలమే మాకు అంగరక్ష, పిలువరే కృష్ణుని, సర్వాంతరాత్ముడు,వలపులు వలపులు ఒయ్యారి, పొడనిద పొక్కిల్లో, సకల లోకేశ్వరుడు, నగధర నందగోప, ఎంతవాడవయ్య, దీనుడ నేను, అఖిలలోక వంద్యుడ మొదలైన కీర్తనలతో సభను అలరించారు.
అనంతరం విజయవాడ కు చెందిన రాంప్రసాద్, డా. రవికుమార్ (మల్లాది బ్రదర్స్) గాత్ర సంగీతం సభను భక్తిసాగరంలో ముచ్చెత్తింది. వీరు శరణంబితడే అనే అన్నమయ్య కీర్తన, ముత్తుస్వామి దీక్షితుల శంఖ చక్ర గదాధర మొదలైన కీర్తనలు సంప్రదాయ బద్ధంగా ఆలపించారు. వీరికి వయొలిన్ పై మల్లాదిరాజేశ్వరి, మృదంగంపై మల్లాది శివానంద్ చక్కగా సహకారం అందించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి పురవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి.