
హైడ్రా ప్రజావాణికి 29 ఫిర్యాదులు
హైదరాబాద్ : వర్షాలు కొనసాగుతున్న వేళ నాలాల ఆక్రమణలపైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్రమణలతో తమ కాలనీలు, నివాస ప్రాంతాలను వరద ముంచెత్తుతోందని పలువురు బాధితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాలను ఆక్రమించి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తున్నారని, దీంతో వరద పోటెత్తుతోందని పలువురు వాపోయారు. ఓపెన్ నాలాలను మూసేయడంతో సిల్ట్ రిమూవల్ సరిగా సాగడం లేదని పేర్కొన్నారు. మొత్తం 29 ఫిర్యాదులు అందాయి. ఇందులో అధిక మొత్తం నాలాల ఆక్రమణలపైనే ఉండడం విశేషం. వీటి తర్వాత స్థానం రహదారుల ఆక్రమణలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్‌కుమార్ పరిశీలించి.. పరిష్కార బాధ్యతలను అధికారులకు అప్పగించారు.
బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీని వరద ముంచెత్తుతోందని ఆ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వర్షం వస్తే చాలు పై నుంచి బేగంపేట రైల్వే స్టేషన్, కంట్రీ క్లబ్, కుందన్‌బాగ్ మీదుగా వచ్చిన వరద మా కాలనీలో నిలిచిపోతోందని వాపోయారు. ఎన్ని సార్లు అన్ని విభాగాలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేక పోయిందన్నారు. తమ కాలనీ నుంచి ధారాలంగా వెళ్లే వరదకు అడ్డుకట్టలా నిర్మాణాలు జరగడంతోనే తమకు ఈ సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు. 660 ఇళ్ల వారితో పాటు చుట్టుపక్కల ఉన్న అపార్టుమెంట్ వాసులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే వరద సాఫీగా వెళ్లేలా చూడాలని కోరారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని జోడిమెట్ల క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నాలాను మేధా సెర్వో డ్రైవ్స్ కంపెనీకి చెందిన వారు ఆక్రమించడంతో వరద రహదారులను ముంచెత్తుతోందని, వాహన రాకపోకలకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని హిగిరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు ఫిర్యాదు చేశారు. కాలనీలలో మురుగు నీరు నిలిచిపోయి రోజుల తరబడి ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ, ఎర్రకుంట మస్జిద్-ఏ-కుబా పరిసరాల్లోని నాలాను అక్రమంగా మూసి వేశారని తెలిపారు. అసలు 20 అడుగుల వెడల్పుతో ఉన్న నాలాను సమీప ప్రాపర్టీ యజమాని తన ఇష్టప్రకారం కేవలం 3 అడుగుల RCC పైప్ వేసి మూసివేశారని దీంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోతూ మస్జిద్ లోపలకే మురుగు నీరు ప్రవహిస్తోందని ఆవేదన చెందారు.