
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీ : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయటం ప్రారంభిస్తుందన్నారు. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పని చేస్తోందని చెప్పారు సీఎం. పనిచేసే యువత భారత్ కు ఉన్న అతిపెద్ద వనరు అని ఇదే కీలకం కాబోతోందన్నారు. ఇదే దేశాభివృద్ధికి కీలకం అని పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో 500 గిగావాట్లను దేశంలో ఉత్పత్తి చేయాలని నిర్దేశిస్తే…అందులో ఏపీలోనే 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్య విధానం అమలు చేయటంలో అగ్రస్థానంలో ఉందన్నారు. పోటీ ప్రపంచంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు. సంస్కరణలు ఆలస్యంగా ప్రారంభించినా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా మరింత సులభంగా వాణిజ్యం జరుగుతుందన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగాం. యూపీఐ పేమెంట్ విధానాన్ని సింగపూర్, ఫ్రాన్స్ లాంటి దేశాలకూ పరిచయం చేశామని తెలిపారు సీఎం. ఏపీ సోలార్, పంప్డ్ ఎనర్జీ, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టులు చేపట్టాం. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తయారు చేస్తామన్నారు. భారత కర్బన ఉద్గారాల రహిత ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఏపీ ఉంటుందని స్పష్టం చేశారు.