అమరావతి : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న శనివారం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యాధునిక వసతులతో నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు దాదాపు రూ. 17 వేల కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ఏపీ కూటమి సర్కార్. పెద్ద ఎత్తున సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అంతే కాకుండా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ‘ధింసా’ నృత్య ప్రదర్శన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి గమ్మడి సంధ్యారాణితో కలిసి సమీక్షించారు వంగలపూడి అనిత. ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమంలో, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా 13,000 మంది గిరిజన బాలికలతో నృత్య ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, కింజారపు అచ్చెన్నాయుడు, ఆనం రామ నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, భరత్ తో పాటు ఎంపీలు హాజరు కానున్నారు.






