
చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా అంటూ పురవీధులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఒక్క గరుడ వాహన సేవ రోజే 3 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు శ్రీవారిని. అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఈ ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ గురువారం వరకు కొనసాగనున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇక తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనంద రసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.