
హైడ్రా కమిషనర్‌కు హనుమంతరావు వినతి
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ ఎంపీ వి. హనుమంత రావు. ఈ సందర్బంగా ఆయన బతుకమ్మ కుంటను అభివృద్ది చేయడంలో, పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినందుకు అభినందించారు. ఈ సందర్బంగా కీలక సూచన చేశారు కమిషనర్ ను. ఇక నుంచి బతుకమ్మ కుంట సంరక్షణను చూడాలని కోరారు. బతుకమ్మకుంటను బాగా అభివృద్ధి చేశారని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారి పోయాయని అన్నారు.. బతుకమ్మ కుంట నిర్వహణ బాధ్యతను కూడా హైడ్రా తీసుకోవాలని కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కబ్జాల చెర నుంచి బతుకమ్మ కుంటను కాపాడడం, చెరువుగా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించడం ఇలా అన్ని కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయని ప్రశంసించారు.
ఈ విషయంలో హైడ్రా చేసిన కృషి అభినందనీయమని వీహెచ్ అన్నారు. బతుకమ్మకుంటను అభివృద్ధి చేసి వదిలేశారు అనే అపవాదు రాకుండా దీని పరిరక్షణ బాధ్యతను హైడ్రా తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. లేని పక్షంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆహ్లాదకర వాతావరణం దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మకుంట ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారిందని అన్నారు. ప్రారంభోత్సవం నాటి నుంచి నేటి వరకూ అక్కడ ప్రతి రోజు సాయంత్రం సందడి వాతావరణం నెలకుంటోందన్నారు. వందలాది మంది వచ్చి బతుకమ్మ ఆడారన్నారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా బతుకమ్మ ఆటలు ఆడుతారని ఈ నేపథ్యంలో చెరువు అందాలు ఏమాత్రం దెబ్బతినకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం బతుకమ్మకుంటలో ఉన్న బోటు షికారును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.