తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ సెప్టెంబర్ నెలలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి శ్రమకోర్చి స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గమనించాలని, అందుకు అనుగుణంగా తమ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
సెప్టెంబరు 4న గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారని తెలిపింది టీటీడీ. 7న చిన్న వీధి ఉట్లోత్సవం, ఆగస్టు 8న పెద్ద వీధి ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.12న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవింద రాజ స్వామి వారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు. 21న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపింది టీటీడీ. 22 నుండి 24వ తేదీ వరకు ఉంటాయని పేర్కొంది.
26న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామివారి గరుడ సేవ నిర్వహిస్తారని వెల్లడించింది.






