సికింద్రాబాద్ : మల్కాజిగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ నగరంలోని బోడుప్పల్ (చెంగిచెర్ల) ప్రాంతానికి చెందిన యువ స్కేటర్లు విశ్వంక్ తేజ్ , ఇషాన్ తేజ్ అనేక అవార్డులు, రికార్డులను సాధించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.రాములు-సంధ్య దంపతుల కుమారులైన వీరు ఇప్పటి వరకు సుమారు 60 అవార్డులను గెలుచుకున్నారు; ‘తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ‘ఖేలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించు కోవడం ఎంతో గర్వకారణం అని అన్నారు. రాబోయే రోజులలో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
చిన్న వయసులోనే స్కేటింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో జాతీయ , అంతర్జాతీయ స్థాయిలలో మరిన్ని విజయాలు సాధించి దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింప జేస్తారని ఆశిస్తున్నానని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్. వారి ప్రతిభకు గుర్తింపుగా ‘ప్రధాన మంత్రి జాతీయ బాలల పురస్కారం-2026’ (Prime Minister’s National Child Award–2026) కోసం దరఖాస్తు చేసినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి , ఇతరులు పాల్గొన్నారు.





