హైదరాబాద్ : అంచనాలకు మించి ఆదరణ చూరగొంటోంది అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 రియాల్టీ షో. ఈ కార్యక్రమం ఒకే సమయంలో స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఇండియాలో ఈ షో టాప్ లో కొనసాగుతోంది. ఇందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నారు అక్కినేని నాగార్జున. ఇదిలా ఉండగా మొదటి వారంలోనే ఊహించని మలుపు తిరిగింది ఈ షో. డేంజర్ జోన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉండడం విస్తు పోయేలా చేసింది. ఆటలో తమ సత్తా చాటుకునేందుకు పోటీదారులు ప్రయత్నిస్తుండగా, ప్రేక్షకులు జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ 10 తెలుగులో మొదటి రోజు నుండే డ్రామా మొదలైంది. ఇప్పటికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి, ముఖ్యంగా కంటెస్టెంట్ త్రిగుణ్ తన దూకుడు ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక ఆశ్చర్యకరమైన పరిణామంలో నామినేషన్ల విషయంలో బిగ్ బాస్ ఒక భారీ ట్విస్ట్‌ను ప్రకటించారు.
ఈ వారం సాధారణ నామినేషన్ ప్రక్రియ జరగలేదు. దానికి బదులుగా బిగ్ బాస్ మొత్తం 16 మంది కంటెస్టెంట్లను నేరుగా ‘డేంజర్ జోన్’లో ఉంచారు. పాల్గొన్నవారు ప్రస్తుతం కేవలం కంటెస్టెంట్లు మాత్రమేనని, ఇంకా పూర్తి స్థాయి ‘హౌస్‌మేట్స్’ (ఇంటి సభ్యులు) కాలేదని బిగ్ బాస్ స్పష్టం చేశారు. హౌస్‌మేట్ హోదాను పొందాలంటే, వారు వారం పొడవునా కఠినమైన సవాళ్లను అధిగమించి టాస్క్‌లలో గెలవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా వారం చివరలో ఎలిమినేషన్ మాత్రం జరుగుతుంది. 16 మంది కంటెస్టెంట్లలో 10 మంది సెలబ్రిటీ కేటగిరీకి చెందిన వారు కాగా, 6 మంది ‘అగ్ని పరీక్ష’ మార్గం ద్వారా ప్రవేశించారు. కొందరు ఆటగాళ్లకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే ప్రత్యేక కీలు లభించాయి, ఇందులో నామినేషన్ల నుండి రక్షణ కూడా ఉంది.







