
రెడ్డి సంఘానికి జాజుల స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన రెడ్డి సంఘానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో అత్యధికంగా 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఆయన ప్రధానంగా రెడ్డి జాగృతి సంఘం నేతలు మాధవ రెడ్డి, గోపాల్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈనెల 7వ తేదీన పూలే విగ్రహాల ముందు నిరసనలు, ఆందోళనలు చేపడతామని అన్నారు. మాధవరెడ్డి గోపాల్ రెడ్డి లను ముందు పెట్టి బీసీ రిజర్వేషన్లకు గండిగొట్టి బీసీలను రాజకీయంగా అణిచి వేయాలని పథకం పన్నుతున్నారని ఆయన ఆరోపించారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినప్పుడు గానీ, రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు గాని, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినప్పుడు గాని ఎప్పుడూ నోరు ఎత్తని రెడ్డి సంఘం తీరా 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవోను విడుదల చేయగానే రాత్రికి రాత్రే కోర్టులను వేదికగా చేసుకొని బీసీలకు అన్యాయం తలపెట్టాలని చూస్తున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు బీసీల పక్షాన ధర్మం, న్యాయం ఉన్నదనీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం తమకుందన్నారు . ఒకవేళ బీసీ రిజర్వేషన్లు తగ్గితే చరిత్రలో మాధవరెడ్డి , గోపాల్ రెడ్డిలు బీసీ ద్రోహులుగా మిగిలి పోతారని, వారిని చరిత్ర క్షమించదన్నారు.