సాహితీ స్కాం రూ. 1800 కోట్లు
ప్రీ లాంచ్ పేరుతో దందా
హైదరాబాద్ – రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ మారాక అక్రమాలు, భూ దందాల భాగోతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో అడ్డగోలు దందాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదవుతున్నా మోసాలు ఆగడం లేదు.
రోజుకు ఒక స్కాం (కుంభకోణం) బయట పడుతోంది. తాజాగా సాహితీ ఇన్ ఫ్రా స్కామ్ ద్వారా జరిగిన మోసం గురించి పోలీసులు బట్ట బయలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 1800 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు గులాబీ నేతలతో అంటకాగిన సదరు సంస్థ సాహితీ ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మీ నారాయణ అడ్డగోలుగా ముంచేశాడు.
రియల్ ఎస్టేట్ పేరుతో నిట్ట నిలువునా ముంచిన ఆయనకు మాజీ సీఎం కేసీఆర్ పిలిచి మరీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆరోపణలు తీవ్రం కావడంతో బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశాడు.
ఆ తర్వాత మోసాల చిట్టా బయట పడుతూ వచ్చింది. సాహితీ ఇన్ ఫ్రాకు సంబంధించి ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు పోలీసులు. 9 ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు వసూలు చేసింది. వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు వెల్లడించారు.
విచిత్రం ఏమిటంటే భూములు కొనుగోలు చేయకున్నా ప్రీ లాంచ్ పేరుతో దందా చేశాడు. దీని వెనుక కల్వకుంట్ల కుటుంబం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.