
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మరోసారి సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవన్నీ పుకార్లు తప్ప వాస్తవం కాదన్నారు. తానే సీఎంనని, తానే సుప్రీం అని మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర కామెంట్స్ ను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు సిద్దరామయ్య. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమ పార్టీలో అందరూ ఒకేతాటిపై ఉన్నామని, పని చేస్తున్నామని చెప్పారు. అయితే పార్టీ అన్నాక ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ అనేది ఉంటుందన్నారు. దీనిని ఎవరూ కాదనలేమన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని పేర్కొన్నారు సిద్దరామయ్య.
తాను కేవలం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటానని కొందరు ప్రచారం చేస్తుండడం పట్ల స్పందించారు. ఐదేళ్ల పాటు పూర్తి కాలం కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పని చేస్తానని ప్రకటించారు. అయితే నవంబర్‌లో రాష్ట్రంలో రాజకీయ విప్లవం జరుగుతుందనే ఊహాగానాలను తిరస్కరించారు, దీనిని ‘భ్రమ’ అని పిలిచారు. తాను పూర్తి పదవీకాలం కొనసాగిస్తానని గత వారం ఆయన పునరుద్ఘాటించారు, తన రెండవ పదవీకాలంలో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు సీఎం. మిగిలిన వ్యవధిలో పదవిలో ఉంటానని కుండ బద్దలు కొట్టారు. కాగా కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఆదివారం బీహార్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా రాజకీయ మార్పులు జరుగుతాయని బాంబు పేల్చారు.