హైదరాబాద్ : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పై. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోజు రోజుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఇదే క్రమంలో ప్రజల దృష్టి బీఆర్ఎస్ వైపు మళ్లుతోందని హెచ్చరించారు. ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చిన సర్కార్ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో , ఏం చేస్తున్నాడో తనకే తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు కూనంనేని సాంబశివరావు.
రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఇక ప్రజలకు సేవలు వీరు ఎలా అందిస్తారంటూ , సమస్యలు ఎలా పరిష్కరిస్తారంటూ నిలదీశారు. నీటి పారుదల శాఖలో నిధుల కొరత ఉందని, పైగా అందుబాటులో ఉన్న బడ్జెట్ను కూడా సమర్థవంతంగా వినియోగించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూనంనేని సాంబశివరావు. నిధుల విడుదలలో మంత్రులకు స్వేచ్ఛ లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి ఆర్థిక శాఖ అనుమతి కోరాల్సి రావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. దీనికి సర్కార్ బాధ్యత వహించాలన్నారు.





