అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశారు. 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు.. మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గృహ అవసరాలు తీరాలంటే మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో మిగిలి ఉన్న గ్రామీణ గృహ అవసరాలను పూర్తిగా తీర్చి, 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, ఆ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎంఆ లేఖలో హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ అంశాలపై వ్యక్తిగత చొరవ తీసుకుని, నిధుల విడుదల, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎం కోరారు.





