చెన్నై : తమిళనాడు సీఎం విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహిళల పట్ల ఎవరు చులకన చేసి మాట్లాడినా లేదా దూషించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు సీఎం. ఆదివారం తిరుప్పూర్ జిల్లాలో ఉప ఎన్నిక జరగనున్న ధారపురంలో రోడ్‌షో సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నాయకులు మహిళలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఆయన తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సత్యభామ తరపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయ చర్చలలో పెరుగుతున్న వ్యక్తిగత దాడులు , “మోటు మాటల”పై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీలకు మహిళలను లక్ష్యంగా చేసుకోకుండా “గట్టి హెచ్చరిక” జారీ చేశారు. డీఎంకే నాయకులు మహిళలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన రాజకీయ ప్రసంగాలను ప్రస్తావిస్తూ, ఆయన ఇలా అన్నారు విజయ్. మీరు డీఎంకే , మరికొన్ని పార్టీలకు ఓటు వేస్తే, అది మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి, బహిరంగ ప్రదేశాల్లో వారిని అవమానించే వారికి మద్దతు ఇవ్వడమే అవుతుందని నేను మీకు ముందే చెప్పాను. నేను కేవలం రాజకీయ లబ్ధి కోసం అలా అనలేదు. మొన్న ఏం జరిగిందో చూడండి. టీవీకే ధారపురం ఉప ఎన్నికల అభ్యర్థి పి. సత్యభామపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.





