హైదరాబాద్ : అందరూ అనుకున్నట్లే విక్టరీ వెంకటేష్ కీ రోల్ పోషించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించారు నిర్మాత నాగవంశీ. వాస్తవానికి అక్టోబర్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈనెల 6న ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు. తీరా అభిమానులను నిరాశ పరుస్తూ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక పరంగా కొంత ఇబ్బంది ఏర్పడిందని, అందుకే ఈ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. వ్యతిరేకతను నివారించడానికి, ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని, అందుకే సినిమా వాయిదా పడిందని ఆయన వివరించారు.
వెంకటేష్, సురేష్ బాబు విదేశాల్లో ఉన్నారని తెలిపారు నాగవంశీ వారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, వారితో చర్చించి తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. వాయిదాకు గల కారణం గురించి మీడియా ప్రశ్నించగా తాము ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశామని, అయితే సినిమా తమ సాంకేతిక అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి విడుదల విషయంలో తొందర పడకూడదని అనుకుంటున్నామని నిర్మాత అన్నారు. సినిమాకు సంబంధించిన అన్నీ పూర్తయ్యాయి. కానీ మేము ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం మేము అక్టోబర్ 9వ తేదీని ధృవీకరించామని నేను అంగీకరిస్తున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా, వేరే మార్గం లేదన్నారు.







