వైస్సార్ కడప జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు రాయలసీమ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించనున్నాయన్నారు. ప్రొద్దుటూరులో రూ.30,156 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడారు. ఒకప్పుడు రాళ్లు తేలిన రాయసీమలో కూటమి పాలనలో నేడు రైజింగ్ సీమగా ఆవిర్భవిస్తోందన్నారు. రాయలసీమ జిల్లాలను పారిశ్రామిక, ఇంధన హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
ఇటీవలే రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు ఎస్. సవిత. రాయలసీమలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో యువతకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశకాలు లభిస్తున్నాయన్నారు. సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టామన్నారు. పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో మారు మూలగ్రామాల్లోనూ సైతం రహదారులు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పుడు రూ.30 వేల కోట్లతో అమరజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించడమే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల పరిశుద్ధమైన నీటిని అందించడమే లక్ష్యంగా అమరజీవి జలధార కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి సవిత తెలిపారు.





