
హామీల అమలులో సీఎం పూర్తిగా వైఫల్యం
హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో చెప్తారన్నారు. అట్లాగే, మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే పిల్లల్ని మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2,500, వృద్ధులకు నెలకు రూ. 4,000 పెన్షన్ అన్నారని కానీ దానిని పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏం మొఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని ప్రశ్నంచారు.
తప్పకుండా కాంగ్రెస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయని, మళ్ళీ తిరిగి తమ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో శ్మశాన వాటిక విషయంలో వాళ్ళు మేం తెచ్చామన్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అని అన్నారు. కానీ, 125 ఎకరాలు, 125 ఎకరాలు ముస్లింలకి, క్రిస్టియన్లకి శ్మశాన వాటికల కోసం 2022 లోనే కేటాయించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ 2,500 గజాలు ఇచ్చి మేమేదో చేశామని చెప్పుకుంటే అది సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌లో స్థలాలు లేవు, స్థలం ఉన్నా వివాదాలు ఉన్నాయన్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు 125 ఎకరాలు కేటాయిస్తూ జీవో కూడా 2022వ సంవత్సరంలో ఇచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ కొత్త మోసం బయట పడిందన్నారు. 2,500 గజాల స్థలం ఇచ్చామని, పండుగ చేసుకోమన్నారు. అక్కడికి వెళితే ఆర్మీ వాళ్లు వచ్చి స్థలం తమదని, ఇక్కడ కాలు మోపితే తాట తీస్తామని హెచ్చరించారని అన్నారు.