ఏపీలో కొత్తగా మరిన్ని గురుకులాల ఏర్పాటు
కర్నూలు జిల్లా : వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడి తోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేయడమే టీడీపీ ధ్యేయమన్నారు. ఎందరో వాల్మీకి సామాజిక వర్గ నేతలకు మంత్రిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఇతర ప్రజాప్రతినిధులుగా చంద్రబాబు నాయుడు అవకాశమిచ్చారన్నారు. రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించేలా 2014-19లో సీఎం శాశ్వత జీవో తీసుకొచ్చారన్నారు. సత్యపాల్ కమిటీ నివేదిక మేరకు 2014-19 మధ్య వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిన ఘనత చంద్రబాబు దేనన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా కృషి చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు పావలా వడ్డీకే విద్యా రుణాలు అందజేయనున్నామన్నారు. ఇందుకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీగా ఉంటుందన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ పొందిన బీసీ అభ్యర్థులు 250 మంది వరకూ టీచర్లగా నియమితులయ్యారన్నారు. ప్రతి బీసీ ఇంటి నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత చెప్పారు. ఇందుకోసం స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలలోనూ, మెగా డిఎస్సీలోనూ, జీఎస్టీలోనూ ఎక్కువ లబ్ధి చేకూరింది బీసీలకేనన్నారు.






