నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాదులోని అంబర్ పేటలో ఉన్న మహత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి రెండు నాలుకల విధానం వల్ల బీసీ రిజర్వేషన్ల పై తమకున్న వ్యతిరేక భావనతోనే ఢిల్లీలో రాష్ట్రపతి, గల్లీలో గవర్నర్ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపడం లేదని ఆరోపించారు. రాష్ట్రపతి భవన్ ను రాజభవన్ ను ప్రభావితం చేస్తున్న అదృశ్య శక్తి బిజెపి అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే కనీసం గవర్నర్ కలిసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయించే వారని కానీ ఆ పని బిజెపి చేయడం లేదని ఆయన అన్నారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ లేదని రెడ్డి జాగృతి కి చెందిన రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టుల ను వేదికగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణచి వేయాలని కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుట్రలను ఎండగట్టి బీసీ రిజర్వేషన్లను రక్షించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకు నిర్వహించామని ఇది బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఒక్క శాతం తగ్గినా భవిష్యత్తులో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు.






