కనులారా వీక్షించిన భక్త బాంధవులు
తిరుమల : తిరుమల అశేషమైన భక్త జనవాహినితో నిండి పోయింది. ఎక్కడ చూసినా శ్రీనివాసా గోవిందా, గోవిందా గోవిందా , హరి హర గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా, అదివో అల్లదివో శ్రీహరి వాసము అంటూ భక్తులు స్వామి వారి సంకీర్తనలతో హోరెత్తించారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో క్రిక్కిరిసి పోయింది. పౌర్ణమి సందర్బంగా గరుడ వాహన సేవ అంగరంగ వైభవోపేతంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ కీలక ప్రకటన చేశారు. రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రతి ఏటా వచ్చే దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్త బాంధవులు గుర్తించాలని, తమతో సహకరించాలని కోరారు.
ఇక పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







