నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు కాంగ్రెస్ బాకీ కార్డులను ఇవ్వాలన్నారు. కారు-బుల్డోజర్ మధ్య పోరాటమే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే రేవంత్‌రెడ్డి సర్కారుకు కనువిప్పు కలుగుతుందన్నారు. ఎన్నికల తరువాత మీ ఇంటికి కారు రావాలో, బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
అందరి చూపులు జూబ్లీహిల్స్ వైపే ఉన్నాయని, ధోకా తిన్న తెలంగాణకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మోకా వచ్చిందని, ఇక్కడ కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదిరి పడాలని అన్నారు. ఓటమి భయంతో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.. మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించేందుకు కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. నెల రోజులపాటు ఇంటింటికీ బాకీకార్డు పట్టుకుని వెళ్లాలని సూచించారు పార్టీ శ్రేణులకు. దొంగ ఓట్లు పడకుండా అందరినీ ఓట్లు వేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు కేటీఆర్.






