ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ ఒప్పందం
ఢిల్లీ : విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో గూగుల్ కంపెనీతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పెమ్మసాని చంద్రశేఖర్ , నిర్మలా సీతారామన్ తో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను కూడా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని, ఇప్పుడు విశాఖ నగరానికి గూగుల్‌ను తీసుకొస్తున్నామని అన్నారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని అన్నారు.
సాంకేతికను అందిపుచ్చు కోవడంలో తమ రాష్ట్రం ముందంజలో ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని వెల్లడించారు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చామని చెప్పారు సీఎం. ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషంగా ఉందన్నారు. విశాఖకు గూగుల్ తీసుకు రావడంలో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని, ఈసందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ, గూగుల్‌కే కాదు. భారత్‌కు కూడా ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.






