
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా , మేరా భారత్ మహాన్ అంటూ ఊదర గొడుతున్న మోదీ బీజేపీ ప్రభుత్వానికి చెంప పెట్టు కేరళ సాధించిన విజయం. ప్రపంచం మారుతోంది. ప్రధానంగా టెక్నాలజీ పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ అంతటా యూపీఐ వినియోగం పెరిగి పోయింది. గతంలో లావాదేవీలు జరపాలంటే తప్పనిసరిగా బ్యాంకులు లేదా వివిధ ఆర్థిక, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లే వాళ్లు. లేదంటే చేబదులు తీసుకునే వాళ్లు. పెద్ద ఎత్తున డబ్బులు (నోట్ల కట్టలు) అవసరం అయ్యేవి. ఇదంతా ఖర్చుతో కూడుకున్నది, సమయం ఎక్కువగా పట్టేది. కానీ సీన్ మారింది. పూర్తిగా టెక్నాలజీ డిజిటల్ లోకి వచ్చేసింది. దానిని వినియోగించకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఏ వస్తువు కొనాలన్నా, లేదా డబ్బులను ఖాతాలలో జమ చేయాలంటే తక్కువ ఖర్చుతో క్షణాల్లో పంపించే వెసులుబాటు వచ్చేసింది. దీంతో 143 కోట్ల మంది భారతీయులు కలిగిన దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లిటరసీ అనేది భాగంగా మారింది. దేశం గర్వించేలా, యావత్ ప్రపంచం విస్తు పోయేలా సీపీఎం ఆధ్వర్యంలోని కేరళ ఆదర్శ ప్రాయంగా, స్పూర్తి దాయకంగా నిలిచింది.
100 శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా అవతరించింది. దీనికి డీజీ కేరళ అనే పేరుతో సాంకేతిక పరమైన అక్షరాస్యతను ప్రారంభించింది. తొలుత 21 లక్షల మందికి పైగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి వాయిస్, వీడియో కాల్స్ చేయడం, సర్కార్ కు సంబంధించిన వివిధ సేవలను యాక్సెస్ వినియోగించడం , ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిర్వహించడం , సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకునేలా తీర్చిదిద్దేలా చేశారు. పూర్తి డిజిటల్ అక్షరాస్యతను సాధించింది కేరళ రాజధాని తిరువనంతపురంలోని పుల్లంచర్ల పంచాయతీ అరుదైన ఘనతను సాధించింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసే వృద్దురాలు సి. సరసు లాంటి వాళ్లు ఎందరో డిజిటల్ లిటరసీని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. తన పేరుతో ఏకంగా యూట్యూట్ ఛానల్ ఓపెన్ చేసింది. ఆపై రోజూ వారీ కార్యక్రమాలను, తన వారితో కూడా వీడియో కాల్స్ చేస్తోంది. రోజూ వారీగా తనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను కూడా ఇంటి వద్ద నుంచే చేసుకుంటోంది.
తనే కాదు మువట్టుపుళలో 75 ఏళ్ల కృష్ణకుమార్ ఇప్పుడు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నడుం బిగించారు. తన లాంటి వయసు మళ్లిన వారిని , ప్రజలను , నిరక్షరాస్యులను వాట్సాప్ ద్వారా ప్రచారం చేసేందుకు ఉపయోగించారు. దీని ద్వారానే డిజిటల్ లిటరసీ గురించి శిక్షణ ఇస్తూ ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన శాఖ డీజీ కేరళకు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం 60 ఏళ్ల వయసు వరకు వచ్చిన వారికే ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ డిజి కేరళ ప్రోగ్రాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది చాప కింద నీరులా. తొలుత 21.88 లక్షల మంది డిజిటల్ నిరక్షరాస్యులుగా గుర్తించారు. ఆ తర్వాత వారిని పూర్తి సాంకేతిక అక్షరాస్యులుగా మార్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. వీరికి పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో 98 శాతం డిజిటల్ అక్షరాస్యులుగా ఉత్తీర్ణులయ్యారు. తక్కువ కనెక్టివిటీ కలిగిన ప్రాంతాలలో కూడా ఆఫ్ లైన్ లో ,ఆన్ లైన్ లో ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు.
కేరళ రాష్ట్రం ఎప్పటి నుంచో విద్యా, ఆరోగ్య రంగాలలో దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తోంది. దేశంలోనే కేరళ టాప్ లో నిలిచింది. 2002లో అక్షయ ప్రాజెక్టును ప్రారంభించంది. ప్రతి కుటుంబానికి డిజిటల్ పరిజ్ఞానం అందించడం దీని లక్ష్యం. కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్నెట్ వాడకం, ఈ-మెయిల్, ఆన్‌లైన్ సర్వీసులు నేర్పించారు. బడి స్థాయిలోనే ఐటీ విద్యను ప్రవేశ పెట్టారు. కంప్యూటర్ పరిజ్ఞానం అందించారు. ఈ శిక్షణ వల్ల ఈ-గవర్నెన్స్, ఆన్‌లైన్ బిల్లులు, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో ముందంజలో కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందగలిగే విధంగా వ్యవస్థలను రూపొందించింది. కేరళ సాదించిన ఈ డిజిటల్ లిటరీసీని ప్రపంచ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ వేదికలపై కేరళ మోడల్‌ను ప్రస్తావిస్తున్నారు. దీనిని స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో డిజిటల్ లిటరసీని సాధించిన ఈ రాష్ట్రాన్ని చూసైనా ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి. డిజిటల్ లిటరసీనే కాదు ఆర్థిక అక్షరాస్యతను కూడా సాధించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రయత్నం జరగాలి