
“ఎవరీ కళాబంధు, ఏమిటా కథ అనుకుంటున్నారా. ఇలాంటి కథలకు సంబంధించిన వాళ్లు ఎందరో ఉన్నారు. వారందరి గురించి చెబితే కనీసం పదేళ్లకు పైగా అవుతుంది. ఆడంబరాలు, జల్సాలకు అలవాటు పడడం, అధికారాలను అనుభవించడం, పదవులను పొందడం, అడ్డగోలుగా సంపాదించడం, కోట్లు వెనకేసు కోవడం, ఆస్తులను కొల్లగొట్టడం, వాటిని తమ బినామీల పేర్ల మీద బదలాయించడం మామూలే. అప్పులు చేయడం, బ్యాంకులను ప్రసన్నం చేసుకోవడం, చివరకు వాయిదాలు చెల్లించక పోవడం, ఆ తర్వాత ఐపీ పెట్టడం, దానికి కోర్టు రక్షణగా ఉండటం షరా మామూలై పోయింది. ఇలాంటి కథలు, మోసానికి పాల్పడిన వాళ్లు, అక్రమ ఆస్తులు పోగుసుకుని మన ముందే దర్జాగా తిరుగుతున్న వాళ్లు కోకొల్లలు. మరికొందరు అధికారం అండతో, చట్టంలోని లొసుగులతో దేశం దాటి వెళ్లి పోయారు. దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఉంటే..తాజాగా బ్యాంకులకు కన్నం వేసి డిఫాల్టర్స్ గా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు . వారిలో ఒకరు అనిల్ అంబానీ కాగా మరొకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కళా బంధుగా పేరు పొందిన తిక్కవరపు సుబ్బిరామి రెడ్డి.”
ఆయన గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రాజకీయ వేత్త, మాజీ ఎంపీ, సినీ నిర్మాత, సమాజ సేవకుడు, శివుడికి అపర భక్తుడు.వ్యాపార, వాణిజ్యవేత్త. కాంట్రాక్టర్, అంతే కాదు మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్థలాన్ని, ఒకానొక దశలో మాజీ సీఎం జగన్ ను గుప్పిట్లో పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న స్వరూపానందేంద్ర స్వామిని ప్రమోట్ చేసిన వారిలో టి. సుబ్బిరామిరెడ్డి కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఇస్తూ ఏకంగా కేంద్ర కేబినెట్ లో, ఇరు తెలుగు రాష్ట్రాలలో ఒకానొక దశలో అన్ని రంగాలలో చక్రం తిప్పాడు. కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తాడు. కోట్లు కొల్లగొట్టాడు. ఆపై పెద్ద ఎత్తున ఈవెంట్స్ ను నిర్వహిస్తూ, అవార్డులను ప్రదానం చేస్తూ , కళాకారులకు ఆత్మ బంధువుగా మారాడు. ఆ తర్వాత తనను తాను భగవత్ స్వరూపుడిగా భావించేలా చేసుకున్నాడు. ఈ దేశంలో అత్యంత లాభదాయకమైన రంగం ఏదైనా ఉందంటే అది గనులు మాత్రమే. దానికి మంత్రిగా కూడా పని చేశాడు. ఎందరినో ఎన్నో రకాలుగా మ్యానేజ్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నారన్న పేరు కూడా సంపాదించాడు మనోడు.
రాజకీయాన్ని, పదవిని, తన పరపతిని అడ్డం పెట్టుకుని అందరి లాగే సుబ్బిరామిరెడ్డి బ్యాంకులకు కన్నం వేశాడు. సులభంగా రుణాలు పొందాడు. కట్టలేక చేతులెత్తేశాడు. తన పరిస్థితి బాగోలేదంటూ వాపోతున్నాడు. ప్రస్తుతం ఈ కళాబంధు దివాలా అంచున ఉన్నానని , తనను ఆదుకోవాలని కోరడం వింతల్లో కెల్లా వింత కదూ. తనకు 81 ఏళ్లు. ఆయన జీవితంలో మరిచి పోలేని పదవిని కూడా పొందాడు. పార్టీ హైకమాండ్ ను ప్రసన్నం చేసుకున్నాడు. ఏం సమర్పించుకున్నాడో తెలియదు కానీ 2004లో టీటీడీ చైర్మన్ గా కూడా పని చేశాడు. పలు సినిమాలను కూడా నిర్మించాడు. ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు ఉన్నాడు. వివిధ పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నాడు. దీనినే అడ్డం పెట్టుకుని గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుతో అడ్డగోలుగా రుణాలు తీసుకున్నాడు. 1967లో నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించినందుకు గాను బంగారు పతకాన్ని కూడా అందుకున్నాడు.
ఈ సమయంలో ఉన్నట్టుండి సుబ్బిరామిరెడ్డి బాంబు పేల్చాడు. వివిధ బ్యాంకులలో తాను తీసుకున్న రూ. 6 వేల కోట్ల రుణాలను చెల్లించలేక దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇంతే మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. అప్పులు ఇచ్చిన బ్యాంకులు కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్లు దాఖలు చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కెనరా బ్యాంక్ కన్సార్షియంలు అప్పులిచ్చిన వాటిలో ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకులు తమ వద్ద తనఖా పెట్టిన షెర్లను నష్టానికి అమ్మేసుకున్నాయి. ఇప్పుడు గాయత్రి ప్రాజెక్ట్స్ అప్పులన్నీ ఎన్సీఎల్టీ పరిధిలో ఉన్నాయి. కాగా దివాలా తీయక ముందే కొన్నింటి ఆస్తులు, విలువైన కార్లు, భూములను అమ్మేసినట్లు గుర్తించాయి బ్యాంకులు. వీటిపై అమ్మేందుకు వీలుండదు..కానీ ఎలా అమ్మారంటూ మళ్లీ బ్యాంకులు ఆశ్రయించాయి. తన కొడుకు సందీప్ కుమార్ రెడ్డి కూడా ప్రముఖ వ్యాపారవేత్త. చాలా ఆస్తులు కూడబెట్టినా దివాలా పేరుతో నొక్కేసేందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు లేక పోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన టి. సుబ్బిరామి రెడ్డి అవసాన దశలో ఉన్నాడు. ఒకవేళ దివాలా ప్రమాదం నుంచి బయట పడాలంటే తనో లేదా కొడుకో వెంటనే కాషాయ కండువా (బీజేపీ)లో చేరితే అన్నీ మాఫీ కావడమో లేక అరెస్ట్ కాకుండా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది.