పవన్ కళ్యాణ్ తో వేదవ్యాస్ ములాఖత్
ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
మంగళగిరి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో మాజీ డిప్యూటీ స్పీకర్ , సీనియర్ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ కలుసుకున్నారు. ఈ సందర్బంగా గంటకు పైగా చర్చలు జరిపారు. మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరిద్దరూ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ వారికి సంబంధించిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడం లేదు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు , పవన్ కళ్యాణ్. ప్రస్తుత తరుణంలో రాజకీయంగా అపారమైన అనుభవం కలిగిన బూరగడ్డ కలుసుకోవడం ఏపీ రాజకీయాలలో చర్చకు దారి తీసింది.