నిజామాబాద్ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనపై స్పందించారు. వాహనం చోరీ చేస్తున్న సమయంలో పట్టుకోబోయిన కానిస్టేబుల్ ప్రమోద్ పై నిందితుడు షేక్ రియాజ్ దాడి చేశాడు. ఈ ఘటనలో తను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇవాళ పోలీసులు తనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మరోసారి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో రియాజ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కీలక అప్ డేట్ ఇచ్చాడు డీజీపీ శివధర్ రెడ్డి.
ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కు పోలీస్ శాఖ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రకటించారు. ఎలాంటి నేరస్తులను అయినా కఠినంగా అణచి వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ. ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రమోద్ పదవీ విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామన్నారు . 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని రేపు జరిగే అమర వీరుల సభలో సీఎం ప్రకటిస్తారని చెప్పారు డీజీపీ.






