పొలిటిక‌ల్ ‘అన‌కొండ‌ల్ని’ ఆప‌లేమా

ప్ర‌జాస్వామ్యం అత్యున్న‌త‌మైన‌ది. దీనిని నిరంత‌రం ప‌రీక్షిస్తూ కాపాడుకుంటూ వ‌స్తున్న ఏకైక సాధ‌నం భార‌త రాజ్యాంగం. దీనిలో ఉన్న లొసుగుల‌ను, చ‌ట్టాల‌ను ఆస‌రాగా చేసుకుని అన‌కొండ‌లుగా త‌యార‌వుతున్నారు దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌లు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై చ‌ట్ట స‌భ‌ల్లోకి వ‌చ్చాక త‌మ‌కు తోచిన రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ప్ర‌త్యేకించి లెక్క‌కు మించిన ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేస్తూ ఆస్తుల‌ను పెంచుకుంటూ పోతున్నారు. వీటిపై నియంత్ర‌ణ లేకుండా పోయింది. ఇక్క‌డ దాచుకున్న‌ది కాకుండా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసి ద‌ర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. పేరుకు ప్ర‌జాస్వామ్యం అన్న‌దే కానీ మొత్తంగా ఏక‌స్వామ్య వ్య‌వ‌స్థ‌గా మారి పోయింది. బాబా సాహెబ్ క‌ష్ట‌ప‌డి త‌యారు చేసిన చ‌ట్టాలు, రూపొందించిన అంశాలు నీటి మీద రాత‌లుగా మారి పోయాయి. దేశానికి చిహ్నంగా ఉండే పార్ల‌మెంట్ సాక్షిగా డ‌బ్బులు పంచుతూ దొరికి పోయారు. ఇది స‌మున్న‌త భార‌తావ‌నిని త‌ల వంచుకునేలా చేసింది. ప్ర‌ధానంగా రాజ‌కీయాల‌లో రాను రాను నేర‌స్థుల సంఖ్య పెరుగుతోంది. హత్యా రాజ‌కీయాల‌కు పాల్ప‌డిన వారి తో పాటు ఆర్థిక నేర‌గాళ్లు పెరిగి పోయారు.

ఇది దేశాన్ని ప్ర‌ధానంగా క‌ల‌వ‌ర పెడుతున్న స‌మ‌స్య‌. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన నాటి నుంచి నేటి దాకా 79 ఏళ్ల‌లో లెక్క‌లేన‌న్ని కేసులు, లెక్కించ లేనంత ధ‌నం ప‌ట్టుబ‌డింది. కొంద‌రు సీఎంలు ఏకంగా జైలు పాల‌య్యారు. మ‌రికొంద‌రు ఇంకా బ‌తికే ఉన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో చోటు చేసుకున్న లొసుగులే వీరిని ప్ర‌ధానంగా ర‌క్షిస్తున్నాయ‌నే అప‌వాదు లేక పోలేదు. రాజ‌కీయాల్లో అన‌కొండ‌లు, నేర‌స్థుల‌ను నియంత్రించాల్సిన అధికారం ఎవ‌రికి ఉంద‌నే ప్ర‌శ్న ఉద‌యించ‌క మాన‌దు. దీనిపై గ‌త కొన్నేళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. ఇందుకు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ఒకానొక సంద‌ర్భంలో కేసు విచార‌ణ సంద‌ర్భంగా. రాజ‌కీయాల్లో నేర‌స్థుల‌ను నిషేధించ లేమ‌ని , దానిని పార్ల‌మెంట్ కే వ‌దిలి వేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఏ చ‌ట్టాల‌ను రూపొందిస్తున్నారో వారే అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

వీరిని ఆది లోనే పోటీలో దిగ‌కుండా చేయాల్సిన బాధ్య‌త కేంద్ర ఎన్నిక‌ల సంఘానిది. ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎంపిక విష‌యంలో సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది మోదీ స‌ర్కార్ కు. సీఈసీ పీఎంను, రాష్ట్ర‌ప‌తిని నిల‌దీసేలా ఉండాల‌ని కానీ జీ హుజూర్ అనేలా ఉండ‌కూడ‌ద‌ని చెంప ఛెల్లుమ‌నించింది. అయినా మోదీ, ఎన్డీయే స‌ర్కార్ కు బుద్ది రాలేదు. విచిత్రం ఏమిటంటే ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీంను తీసుకు వ‌చ్చింది. భారీ ఎత్తున బీజేపీకి వేల కోట్లు స‌మ‌కూరాయి. బ్లాక్ మ‌నీని వైట్ మ‌నీ స్కీంగా మార్చుకునేలా చేసింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇంత‌కు చ‌ట్టాలు ఏం చెబుతున్నాయి. పొలిటిక‌ల్ లీడ‌ర్లు నేరం చేసిన‌ట్లు రుజువైతే ఆరేళ్ల పాటు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీలుండ‌దు. కాగా క్రిమిన‌ల్ కేసులున్న రాజ‌కీయ నాయ‌కుల‌ను పోటీ చేయ‌కుండా నిషేధించేందుకు కోర్టు నిరాక‌రించింది. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు ఆలోచింప చేసేలా ఉన్నాయి. నేరం, రాజ‌కీయం క‌ల‌గ‌లిసిన చోట ప్ర‌జాస్వామ్యం ఎలా మ‌న‌గ‌లుగుతుంద‌ని ప్ర‌శ్నించింది ధ‌ర్మాస‌నం. అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవదీసింది.

అక్ర‌మార్కులు, అవినీతి ప‌రులు, ద‌గుల్బాజీలు, వైట్ కాల‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్న వారు, వ్యాపార‌వేత్త‌లు, ఐపీల పేరుతో దివాలా తీస్తున్న వారంతా దొడ్డి దారిన రాజ‌కీయాల‌ను ఓ వేదిక‌గా మార్చుకుంటుండ‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇందుకు సంబంధించి ముంబై పేలుళ్ల దారుణ ఘ‌ట‌న‌లో దోషులకు శిక్ష ప‌డినా చివ‌ర‌కు వ‌ర‌ల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్లు త‌ప్పించు కోవ‌డం వెనుక పొల్యూటెడ్ పొలిటిషియ‌న్స్ పాల‌కులుగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇదే స‌మ‌యంలో వీరిని క‌ట్ట‌డి చేయాల్సిన బాధ్య‌త కేంద్ర ఎన్నిక‌ల సంఘంపైనే ఉంటుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం.

అయితే నేర స్వ‌భావం ఉన్న వారు పాలిటిక్స్ లోకి రాకుండా ఉండేలా పార్ల‌మెంట్ చ‌ట్టాల‌ను త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌పడింది. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ల‌ను ఎన్నుకునేలా చేయాల్సిన బాధ్య‌త పార్ల‌మెంట్ పై , ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే దేశంలోని ప్ర‌జా ప్ర‌తినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీల‌లో దాదాపు 80 శాతానికి స‌గానికి పైగా నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. క‌ఠిన‌మైన శిక్ష‌లు , జీవిత ఖైదు లేదా జీవిత‌కాలంలో పోటీ చేయ‌కుండా చ‌ట్టం తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారి గురించి ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వ‌స్తేనే కానీ అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాలేదు. ఈ స‌మ‌యంలో మోదీ బీజేపీ ప్ర‌భుత్వం జ‌వాబుదారీత‌నం కోరుకోవ‌డం లేదు. ఎందుకు స‌మాచారం ఇవ్వాల‌ని అంటోంది. ఏకంగా ఆర్టీఐ వ్య‌వ‌స్థ ఎందుక‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇది లేకుండా ఉంటేనే బావుంటుంద‌ని పేర్కొంటోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అత్య‌ధికంగా అవినీతి పొలిటిక‌ల్ అన‌కొండ‌లు ఇప్పుడు రాజ్య‌మేలుతున్నారు. అర‌కొర‌గా, ఒక‌రో ఇద్ద‌రో త‌ప్పిస్తే రాజ‌కీయ పార్టీలు, నేత‌లు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు. మొత్తంగా రాజ‌కీయాలు దాదాపు అన్నీ క‌లుషితంగా మారాయి. ఇది ప్ర‌జాస్వామ్యానికి హెచ్చ‌రిక‌. రాజ్యాంగ నైతిక‌త‌కు భంగం వాటిల్లే ప్ర‌మాదం ఉంది. డెమోక్ర‌సీ మూలాలు దెబ్బ తింటాయి. దీని వ‌ల్ల అరాచ‌క‌త్వం , నియంతృత్వానికి దారి తీస్తుంది. పౌరుల‌కు ఆశ‌నిపాతంగా మారే ప్ర‌మాదం పొంచి ఉంది.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *