ఏపీ సర్కార్ ఆదుకోవడంలో వైఫల్యం
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో అత్యధికంగా సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ మీద ఉన్నంత సోయి రైతుల పట్ల లేకుండా పోయిందన్నారు. దాదాపు 158 మండలాల్లో లక్షన్నర ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాను రాను పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు షర్మిలా రెడ్డి.
అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 25 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 12 వేలు, ప్రకాశం జిల్లాలో 14 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 8 వేలు, కోనసీమ జిల్లాలో 7 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా చేతికి రాకుండా పోయాయని, రైతులు రోడ్ల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆవేదన చెందారు ఏపీపీసీసీ చీఫ్. తాము చెప్పడం లేదని, ఏపీకి చెందిన అధికారులే ఈ వివరాలు వెల్లడించారని అన్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం రైతుల పట్ల ఏపీ కూటమి సర్కార్ కు ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తుందన్నారు . పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలతో పాటు ఇతర పంటలు పనికి రాకుండా పోయాయని వాపోయారు. రైతులకు సంబంధించి నష్ట పోయిన పంటల వివరాలు సేకరించాలని, ఏ ఒక్క రైతుకు నష్ట పోకుండా తక్షణమే నష్ట పరిహారం అందించాలని షర్మిలా రెడ్డి సర్కార్ ను డిమాండ్ చేశారు.






