మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్ : ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సోమవారం ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణం చేశారు. ఈసందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు రూ. 15,000 ఇస్తున్నారని, కానీ శిష్యుడు పంగనామాలు పెట్టాడని ఆరోపించారు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించానని చెప్పారు. ఇప్పటి వరకు పలువురు ఆటో డ్రైవర్లు బతుకు దెరువు లేక ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నారని వాపోయారు. రైతులు, చిరు ఉద్యోగులు, మహిళలు, ఆటో డ్రైవర్లతో సహా ప్రతి వర్గానికి చెందిన వారంతా భగ్గుమంటున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందన్నారు. పేరుకి ఉచిత బస్సు అన్నాడని, ఆడోళ్ళకి ఫ్రీ అన్నారని, మొగోళ్ళకి డబల్ టికెట్ కొడుతున్నారని , అధిక భారం మోపారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదుసార్లు బస్ ఛార్జీలు పెంచిందన్నారు.చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి ఏడాది 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారంటూ రాహుల్ గాంధీపై భగ్గుమన్నారు హరీశ్ రావు.






